Friday, December 23, 2016

ఊరందరికీ ఉపాధి చూపిన యువతి.పనుల్లేక ఖాళీగా ఉన్న వారంతా…ఇప్పుడు చేతినిండా పనులతో ఫుల్ బిజీ అయ్యారు.!


ఊరందరికీ ఉపాధి చూపిన యువతి.పనుల్లేక ఖాళీగా ఉన్న వారంతా…ఇప్పుడు చేతినిండా పనులతో ఫుల్ బిజీ అయ్యారు.!


నేటి ఆధునిక ప్ర‌పంచంలో గ్రామాలు, మారుమూల ప‌ల్లెల సంగ‌తి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే వారికి చేద్దామంటే ప‌ని ఉండ‌దు. తిందామంటే స‌రైన తిండి దొర‌క‌దు. ఈ క్ర‌మంలో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పొట్ట చేత ప‌ట్టుకుని ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన దుస్థితి వ‌స్తోంది. అక్క‌డైనా స‌రైన ప‌ని దొరికి, తిండానికి ఇంత తిండి దొరుకుతుందా, అంటే అదీ గ‌గ‌నమే. అలా ఉన్నాయి నేటి ప‌ల్లె వాసుల క‌ష్టాలు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న అలాంటి ఎన్నో ప‌ల్లెలు నేడు ప్ర‌జ‌లు లేక బోసిపోతున్నాయి. ప‌ల్లెలు, గ్రామాలే మేటి భార‌తానికి ప‌ట్టుకొమ్మ‌లు అని ఎవ‌రో అన్నారు. కానీ అలాంటి ప‌ట్టుకొమ్మ‌లు నేడు ఎండిపోయి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే ప‌ల్లెల ప‌రిస్థితి ఇంత ద‌య‌నీయంగా ఉన్నా ఎవ‌రూ వాటి స్థితిని మార్చ‌డం కోసం ముందుకు రావ‌డం లేద‌నే మాట స‌త్యం. ఎవ‌రో కొద్ది మంది దాత‌లు ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకుని పుణ్యం క‌ట్టుకుంటున్నారు కానీ, ఇంకా చాలా వ‌ర‌కు గ్రామాల ప‌రిస్థితి మార‌లేదు. ఏ ఇంటిని చూసినా బోసిపోయిన మ‌నుషుల‌తోనే క‌నిపిస్తోంది. అయితే అలాంటి ఇండ్ల‌లో మ‌ళ్లీ న‌వ్వుల పువ్వులు, సంతోషాలు పూయించేందుకు, బోసిపోయిన గ్రామాల‌ను తిరిగి సంద‌డిగా మార్చేందుకు న‌డుం క‌ట్టింది ఆ యువ‌తి. వ‌య‌స్సు చిన్న‌దైనా ఆమె చేసిన పెద్ద‌ ప్ర‌య‌త్నం వ‌ల్ల బోసిపోయిన ప‌ల్లెలు మ‌ళ్లీ మ‌నుషుల‌తో, వారి న‌వ్వుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఇంత‌కీ ఆ యువ‌తి ఎవ‌రు..? ఏం చేసింద‌నేగా..? మీ ప్ర‌శ్న‌..! అయితే ఆ ప్ర‌శ్న‌కు సమాధానం ఇదిగో
ఆమె పేరు దివ్యా రావ‌త్‌. ఉత్త‌రాఖండ్ నివాసి. ఢిల్లీలో సోష‌ల్ వ‌ర్క్ కోర్సులో మాస్ట‌ర్స్ డిగ్రీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె ప్రాజెక్ట్ వ‌ర్క్ కోసం ఓ ఎన్‌జీవోలో చేరింది. ఈ క్ర‌మంలో ఆమె ఉత్త‌రాఖండ్‌లోని ప‌లు గ్రామాల‌ను సంద‌ర్శించాల్సి వ‌చ్చింది. అయితే ఆ గ్రామాల్లో దాదాపుగా ఎవరూ నివాసం ఉండ‌క‌పోవ‌డంతో అవ‌న్నీ ఆమెకు వెల వెల బోయ క‌నిపించాయి. ఎక్క‌డో చాలా దూరంలో ఒక‌టి, రెండు ఇండ్లు మాత్రమే మ‌నుషుల‌తో క‌నిపించాయి. దీంతో ఆమె ఆలోచ‌న‌లో ప‌డింది. అస‌లు ఎందుకు గ్రామాలు అలా మారాయ‌ని అన్వేషించింది. ఈ క్ర‌మంలోనే అందుకు కార‌ణాల‌ను కూడా ఆమె తెలుసుకుంది. ఆయా గ్రామాల్లో చేసేందుకు ప‌ని లేక‌పోవ‌డంతో అక్క‌డి వారంతా ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్లార‌ని గ‌మ‌నించింది. దీంతో వారిని ఎలాగైనా పల్లెల‌కు ర‌ప్పించి, వారంత‌ట వారే ఆర్థికంగా ఎదిగేలా చేయాల‌నుకుంది.
అలా దివ్య తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని వెంటనే అమ‌లు చేసే ప‌నిలో ప‌డింది. అయితే ఆమెకు అప్ప‌టికింకా స‌రైన ఆలోచ‌న రాలేదు. ఆయా గ్రామ‌స్తుల‌కు ఎలాంటి ఉపాధి క‌ల్పించాలా అని ఆలోచించింది. దీంతో వెంట‌నే ఓ ఆలోచ‌న ట‌క్కున వ‌చ్చేసింది. అదే పుట్ట‌గొడుగుల పెంప‌కం. అదే ఎందుకంటే సాధార‌ణ కూర‌గాయ‌లైతే కేజీకి మ‌హా అయితే రూ.40 దాకా ప‌లుకుతాయి. కానీ పుట్ట గొడుగులైతే కేజీకి ఏకంగా రూ.100 వ‌ర‌కు ప‌లుకుతాయి. అంతేకాదు, పుట్ట‌గొడుగుల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో వాటి పెంప‌కం ఎలా చేప‌డతారో క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసింది. అంతే, కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో సౌమ్య ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ‌ను స్థాపించి, దాని ద్వారా పుట్ట‌గొడుగుల పెంప‌కాన్ని చేప‌ట్టింది. గ‌దుల్లోనే నిర్దిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో, చాలా త‌క్కువ వ్య‌యంతో వాటిని పెంచే వీలుండ‌డంతో అన‌తి కాలంలోనే ఆమె అనుకున్న నిర్ణ‌యానికి ఆరంభం ల‌భించింది. చాలా మంది గ్రామ‌స్తులు ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి పుట్ట‌గొడుగుల పెంప‌కం గురించి నేర్చుకోవ‌డం, దానికి త‌గిన‌ట్టుగానే దివ్య వారికి స‌హాయం చేయ‌డం, వారు కూడా పుట్ట‌గొడుగుల పెంప‌కం ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లు పెట్టారు. ఇంకేముంది, సొంత గ్రామాల్లోనే చ‌క్క‌ని ఉపాధి దొర‌క‌డంతో ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్లిన వారు తిరిగి గ్రామాల‌కు రావ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇది ఆరంభ‌మేన‌ని, ప్ర‌తి ప‌ల్లెలోనూ ఇలాంటి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తే అప్పుడు వ‌ల‌స‌లు త‌గ్గించ‌వ‌చ్చ‌ని, దాంతో ప‌ల్లెలు మేటి భార‌తానికి ప‌ట్టుకొమ్మ‌లు కావ‌డం ఖాయ‌మ‌ని దివ్య చెబుతోంది. అంతేగా మ‌రి..! ఏది ఏమైనా మ‌న నాయ‌కులు, ప్ర‌భుత్వాలు చేయ‌లేని ప‌నిని ఓ యువ‌తి చేస్తుండ‌డం నిజంగా హ‌ర్షించ‌ద‌గ్గ విషయం.

No comments:

Post a Comment