Tuesday, December 20, 2016

అమ్మ మృతిపై బయటపడ్డ మిస్టరీ..!!


అమ్మ మృతిపై బయటపడ్డ మిస్టరీ..!!



అన్నాడీఎమ్‌కే అధినేత్రి, మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఆమెపై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని స్వ‌యానా ఆమె బంధువులే ఆరోపిస్తున్నారు. ఆమెకు తెలియ‌కుండా.. మెడిసిన్ మార్చార‌న్న వదంతులు కూడా వినిపించాయి. అస‌లు నిజ‌మేంటి…? అనేది మిస్ట‌రీగా మారింది. అపోలో వైద్య‌బృందం దీనిపై ఇంత‌వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. కానీ, తొలిసారిగా అపోలో చేరిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయే ముందువ‌ర‌కు ఏం జ‌రిగింది..? అనే విష‌యాల‌పై అపోలో చైర్మ‌న్ సి. ప్ర‌తాప్ రెడ్డి ఓ ఇంగ్లీష్ పేప‌ర్‌కి ఇచ్చిన ఇంట‌ర్‌వ్యూలో వివ‌రించారు..అమ్మ అపోలోలో చేరిన‌ప్ప‌టి నుంచి ఆమెకు మెరుగైన చికిత్స అందించామ‌ని, ఆమెను ఒక‌టీరెండు రోజులు మిన‌హా.. మిగిలిన అన్ని రోజులు తానే ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాన‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 22న ఆస్ప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి… జ‌య‌ల‌లిత చికిత్స‌కు బాగా స్పందించార‌ని, ప్ర‌తి రోజూ తన‌ని చూసే న‌వ్వేవార‌ని చెప్పారు.
కొన్ని రోజుల చికిత్స త‌ర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నార‌ని, త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేసేందుకు సిద్ద‌మ‌య్యామ‌న్నారు. అయితే, డిసెంబ‌ర్ 5కి రెండు రోజుల ముందు తాను అత్య‌వ‌స‌ర ప‌ని మీద హైద‌రాబాద్ వ‌చ్చాన‌ని, తాను వ‌చ్చాక డిశ్చార్జ్ చేస్తామ‌ని తెలిపాన‌న్నారు. దానికి ఆమె సంతోషించార‌న్నారు. ఆమె ముఖంపై ఏనాడూ చిరున‌వ్వు చెర‌గ‌లేద‌న్నారు. స‌డెన్‌గా ఆమెకు డిసెంబ‌ర్ 4న గుండెపోటు వ‌చ్చింద‌ని.. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు చేయి దాటిపోయాయ‌న్నారు సి.ప్ర‌తాప్ రెడ్డి. కార్డియాల‌జిస్ట్ ఒక‌రు నిత్యం ఆమెను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని, కానీ, ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేక‌పోయామ‌ని వివ‌రించారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో అదే గ‌దిలో ఉన్న ఎక్మో యంత్రాన్ని ఆమెకు అమ‌ర్చినా ప‌నిచేయ‌లేద‌న్నారు.
ఎక్మో యంత్రం చాలా మందికి పాజిటివ్ ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని, కానీ, జ‌య‌ల‌లిత విష‌యంలో అది వ‌ర్క్ అవ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.అపోలోలో చేరిన‌నాటినుంచి జ‌యలలిత చికిత్సలకు బాగా సహకరించారని, అనారోగ్యం సృష్టించిన బాధలన్నింటిని తట్టుకుని ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన కీర్తించారు. జయలలిత అసాధారణ మహిళ అని, ఆమె కోపంలోనూ ఓ న్యాయం దాగి ఉంటుందని, పార్టీ కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజానీకం మదిలోనూ ఆమె సుస్థిరస్థానం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment