Saturday, December 17, 2016

కాంగ్రెస్ చేయని సాహసం మోడీ చేశారు, బీజేపీ అలా చేస్తే ఉద్యమిస్తా: కేసీఆర్


కాంగ్రెస్ చేయని సాహసం మోడీ చేశారు, 

బీజేపీ అలా చేస్తే ఉద్యమిస్తా: కేసీఆర్


హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం కూడా పెద్ద నోట్ల రద్దు ఆలోచన చేసిందని, కానీ సాహసం చేయలేకపోయిందని, ఇప్పుడు ప్రధాని మోడీ సాహసం చేశారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం చెప్పారు.
ఆయన తెలంగాణ మండలిలో నోట్ల రద్దు పైన మాట్లాడారు. ఎవరికైనా పార్టీలు ముఖ్యం కాదని, దేశం ముఖ్యమని కేసీఆర్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించవద్దని, అలాగని గుడ్డిగా వ్యతిరేకించవద్దన్నారు.
నల్లధనం ఎన్ని రూపాల్లో ఉన్నా దానిని బయటకు తీసుకు రావాల్సిందేనని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అసాధారణ నిర్ణయం అన్నారు. నోట్ల రద్దు పైన మోడీ సర్కార్ ధైర్యం చేసిందన్నారు. ఓ మంచి ప్రయత్నం చేస్తున్న మోడీకి సహకరిద్దామన్నారు.
మహిళల బంగారు ఆభరణాల జోలికి కేంద్రం వెళ్తే తాము తెలంగాణ తరహా ఉద్యమం చేస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ కేంద్రం మహిళల ఆభరణాల జోలికి వెళ్లడం లేదన్నారు. సామాన్యుల బంగారాన్ని కేంద్రం ముట్టుకోదన్నారు. నల్ల బంగారం, లెక్కలోని రాని బంగారాన్ని మాత్రమే బయటకు తీస్తారన్నారు.
క్యాష్ లెస్ అంటే నోటు కనిపించకుండా చేయడం కాదన్నారు. క్యాష్ లెస్ లావాదేవీల్లో తెలంగాణ ముందు ఉన్నదని చెప్పారు. ఎంత వరకు అవసరమో అంత వరకు నోట్లు ఉంటాయని చెప్పారు.
నేను ప్రధాని మోడీ వద్దకు వెళ్తే నోట్లు మార్చుకునేందుకు అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ చెప్పడం విడ్డూరమన్నారు. మోడీ తీసుకున్న నిర్ణయం చాలా మందికి అర్థం కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం మన పరిధిలో లేదన్నారు.
ఎన్నికల ఖర్చు కోసం పార్టీలకు కేంద్రమే డబ్బు ఇవ్వాలని తాను ప్రధాని మోడీకి చెప్పానని అన్నారు. అందుకు సిద్ధంగా ఉన్నట్లు మోడీ చెప్పారన్నారు. రాజకీయాల్లోకి రావడమే తప్పన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలలో పెట్టే నల్ల డబ్బు కూడా రద్దు కావాలన్నారు. రాత్రికి రాత్రే క్యాష్ లెస్ ఇండియా సాధ్యం కాదని చెప్పారు. కానీ ఆ దిశలో ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దుతో కష్టాలు ఉంటాయని ప్రధాని మోడీ చెప్పారని, ఓపిక వహించాలని సూచించారన్నారు. ప్రధాని మోడీ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించవద్దని, అలాగని వ్యతిరేకించవద్దన్నారు. క్లీన్ సొసైటీ వస్తుంటే మనం ఎందుకు వ్యతిరేకించాలన్నారు. కష్టాలు ఉంటాయని, ఓపిక పట్టాలన్నారు.
నోట్ల రద్దు వల్ల కష్టాలు ఒక్క తెలంగాణలోనే లేవని, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. రాజకీయ నాయకులు ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించవద్దన్నారు. నల్ల ధనాన్ని పేదలకే ఖర్చు పెడతామని ప్రధాని చెప్పారన్నారు. అందుకోసమే గరీబ్ కళ్యాణ్ యోజన అన్నారు.
అసమానతలు, దోపిడీ వల్లే నక్సలిజం వస్తుందన్నారు. భరించరాని దోపిడీ జరిగింది కాబట్టే ప్రజలు తెలంగాణను తెచ్చుకున్నారని చెప్పారు. పేదలు ఇంకా పేదరికంలోనే మగ్గాలా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో పేదలకు లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం కొంత తగ్గిన మాట వాస్తవమే అన్నారు. నోట్ల రద్దుతో మంచి జరుగుతుంది కాబట్టి తాను సమర్థిస్తున్నానని చెప్పారు.

No comments:

Post a Comment